పోలీసు విధులకు ఆటంకం : సోము వీర్రాజుపై కేసు నమోదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కోనసీమ జిల్లా ఆలమూరు పీఎస్​లో కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని సోము వీర్రాజుపై అభియోగం మోపబడింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్​ఐని నెట్టడంపై సెక్షన్ 353, 506 కింద కేసులు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే..: తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. అమలాపురం అల్లర్ల బాధితులు, కేసు నమోదైన కుటుంబాల పరామర్శకు సోము వీర్రాజు వెళ్తుండగా పోలీసులు ఆయన్ను జొన్నాడ వద్ద నిలిపేశారు. అమలాపురంలో సెక్షన్‌ 144, పోలీసు చట్టం 30 అమల్లో ఉన్నందున పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జొన్నాడ వద్ద అరగంటపాటు సోము వీర్రాజును ఆపేశారు. తనను ఆపడంపై సోము వీర్రాజు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఆయన్ను రావులపాలెం వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

Leave a Reply