Suryaa.co.in

Devotional

దేవాలయాలకు వెళ్లాలా?

దైవారాధనకు చాలా పద్ధతులున్నాయి. మానసిక పరిపక్వత కల్గినవారు ఏకాంతంగా ఒక గదిలో కూర్చొని మానసికమైన ధ్యానం చేసుకోగలరు. మనస్సును నియంత్రణ చేయలేనివారు దేవాలయంలో వలెనే తమ ఇండ్లలో విగ్రహాలు పెట్టుకొని మంత్ర పఠనంతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. తమ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహించటానికి అవకాశం లేనివారు ఆలయాలకు వెళ్లి అక్కడ ఈ విధులను నిర్వర్తించి భగవదనుగ్రహాన్ని పొందుతారు.

మానవుని దుఃఖాల్ని ఉపశమింప చేయగల దివ్యౌషధం పరమాత్ముని యందు మనంలగ్నం చేసే స్థిరమైన భక్తి విశ్వాసాలే. మన బాధల్ని అధిగమించటానికి ఆవశ్యకమైన దార్ధ్యతను భక్తి సమకూరుస్తుంది. అలాంటి భక్తిని పెంచి పోషించే నిలయాలే ఆలయాలు. ఈ లక్ష్యంతోనే దేవాలయాలు నిర్మింపబడుతున్నాయి.

భగవంతుని తమ గృహాల్లో ఆరాధించేవారు దేవాలయాలకు వెళ్లవలెనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ”అవును. వెళ్లాల్సిందే” అనేదే దానికి సమాధానం. ప్రతివాడు సాయంత్రం 6-30 గం.లకు అనగా ప్రదోషకాలంలో దేవాలయానికి వెళ్లి దైవదర్శనం తప్పని సరిగా చేసుకోవాలనేది మన మతం మనకిచ్చే ప్రత్యేక ఆదేశం. దేవాలయంలోని దేవత నారాధించుటను మనం ఒక ఆజ్ఞగా శిరసావహించాలి.

సర్వవ్యాపకుడైన దైవాన్ని ఆరాధించటానికి దేవాలయాల్లోకే వెళ్లాలా అని వేదాంతులు, పండితులు అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. పరమాత్ముని ప్రతి వస్తువులోను చూడగల ఉచ్చస్థితికి మనం రాగల్గితే నిశ్చయంగా మనం ఆలయ దర్శనం చేయనవసరం లేదు. కాని మనం మన చేతులకున్న కాలుష్యాన్ని దేవాలయ గోడలపై రుద్ది ఆ గోడల్ని కలుషితం చేసే సమయంలో గోడల్లో దేవుని ఉనికిని భావిస్తామా?

ఆ సందర్భంలో భగవానుడు గర్భగుడిలో మాత్రమే వుంటాడని తలుస్తాం. అలా భావించటం కూడ మంచిదే. అలాంటి విశ్వాసంతో దైవదర్శనం చేసికొని, ధ్యానించి దేవునిపై భక్తిని పెంపొందించుకొని భగవానుని సర్వవ్యాపకత్వాన్ని గురించి ఆలోచించే స్థాయికి చేరుకోగల్గుతారు. ఇలా దైవభక్తితో బహుసంఖ్యలో ఆలయాల్లో సమావేశమయ్యే ఆచారం మొత్తం దేశానికే శ్రేయోదాయకం.

మనం ఆలయాల్లో చేసే దైవారాధన మనగోత్ర నామాలు, జన్మనక్షత్రం మొదలైనవి చెప్పింతర్వాత ప్రారంభింప బడుతుంది. ప్రతివాడు తన యోగక్షేమం కొరకే దైవప్రార్థన చేస్తాడు. కనీసం తన కుటుంబ శ్రేయస్సును కూడ అర్థించడు. కాని మానసిక ధ్యానం చేసేవారు మాత్రం నిష్కామంగా ధ్యానజపం ఆచరిస్తారు. ప్రత్యేకమైన శ్రేయస్సులను తాము, తమ కుటుంబం సాధించుకోటానికి ప్రత్యేకమైన పూజావిధానాలున్నాయి.

ప్రతిదేవాలయంలోను నిత్యపూజలుంటాయి. అవి నిర్వర్తించిన తర్వాతే వ్యక్తులు తమ శ్రేయస్సుకోరి తమ గోత్రనామాలతో చేయించే పూజలు, అభిషేకాలు నిర్వహింపబడతాయి. ఇవిగాక సమాజ శ్రేయస్సు లక్ష్యంగా చేసే పూజలు కూడ ఉంటాయి. వీటిని పరార్థ పూజలంటాం. దేవాలయాలు దేశం మొత్తం ప్రజల శ్రేయస్సు కొరకు ఉద్దేశింపబడినవే. అచ్చట అందరు సమానులే.

ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువా అనే భావనకు అవకాశం లేదు. దేవాలయ కార్యక్రమ నిర్వహణలో అందరకు బాధ్యత ఉంది. ప్రతి ఆలయానికి ఒక సేవాసంఘం లేక సేవాసమితి ఉండవచ్చు. కాని దానికి ప్రత్యేక అధికారాలుగాని, హక్కులు గాని ఉండవు. కనుక ప్రజలందరు సమాన హక్కులను అనుభవిస్తూ, సేవానిరతిలో దేవాలయ కార్యక్రమాల్ని జయప్రదం చేయటానికి పూనుకోవాలి.

విగ్రహానికి పూజలు చేసేటప్పుడు ఔపచారిక క్రియలు చాలా నిర్వహిస్తాం. ఇంత క్రియాకలాపంతో కూడిన ఆరాధనను మనం ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఎవరైనా అడగవచ్చు. కేవలం ప్రార్థన చేస్తే చాలదా ? దానికి సమాధానం లేకపోలేదు. మనం అనుభవించే ప్రతి వస్తువు భగవత్ప్రసాదితమే అనే భావనతో కృతజ్ఞతా పూర్వకంగా ఆయనకు ప్రీతియైన పదార్థాలను ఆయనకు నివేదించుంటే ఈ క్రియాకలాపాల అంతరార్థం.

అంతేగాక ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువునకు ఆధారభూతుడు భగవానుడే. వానిని నమ్రతతో ఆయన పాదాలవద్ద సమర్పించి తిరిగి వాటిని స్వీకరిస్తే మన ఆపదలన్నీ పటాపంచలౌతాయి. ఈప్సితార్థాలన్నీ నెరవేరుతాయి. ఆయన కరుణా కటాక్షానికి పాత్రులమయ్యామనే ఆనందం మనకు దక్కుతుంది. భగవంతునకు మనం చేసే అర్పణల వెనుకనున్న ఆంతరంగిక భావన ఇదే.
(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహ భాషణములనుండి)

LEAVE A RESPONSE