చంచల్ గూడ జైలర్‌ను కలిసిన రేవంత్

హైదరాబాద్ : చంచల్ గూడ జైలర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. జైల్‌లో ఉన్న విద్యార్థులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలవడానికి ములాఖాత్ కోసం జైలర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. రేవంత్‌తో పాటు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ జైలర్‌ను కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినది రాహుల్ గాంధీ అని తెలిపారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలతో శవాల దిబ్బగా మారుతోందని అని అన్నారు. పంటను కొనే దిక్కులేక రైతు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వారికి అండగా నిలవడానికి రాహుల్ వస్తున్నారని తెలిపారు. ఉద్యమంలో ఉస్మానియా కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూను సందర్శించడానికి రాహుల్ వస్తున్నారన్నారు. తమ నేతలు జగ్గారెడ్డి, వి.హెచ్, ఓయూ విద్యార్థులు వీసీకి రాహుల్ సభకు అనుమతి కోసం వినతి పత్రం ఇచ్చారని అన్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో తిరస్కరించినట్లు చెప్పారు. అనుమతి కోరిన తమ విద్యార్థి విభాగం నేతలను జైల్‌లో పెట్టారన్నారు. జైల్‌లో ఉన్న విద్యార్థులను కలవాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply