రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు

– పాడి రంగంపై ఆధారపడి ఉన్న రైతులకు ఆర్ధిక స్వావలంబన
– రంగారెడ్డి జిల్లా రావిర్యాల లో 250 కోట్ల రూపాయల వ్యయంతో 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో అత్యాధునిక మెగా డెయిరీ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

పాడిరంగంపై ఆధారపడిన రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం ద్వారా పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ గా ఇటీవల బాద్యతలు చేపట్టిన సోమా భరత్ కుమార్ అద్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజిరావు, NDDB అధికారి సునీల్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బ్యాంకు రుణాల ద్వారా ఒక్కో నియోజకవర్గానికి 2500 నుండి 3 వేల యూనిట్ల వరకు పాడి పశువులను ఇప్పించడం ద్వారా యువతకు, పాడి రంగంపై ఆధారపడి ఉన్న రైతులకు ఆర్ధిక స్వావలంబన వచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా సుమారు లక్ష మందికి జీవనోపాధి కలగనున్నది. పాడి సంపద అభివృద్ధి ద్వారా విజయ డెయిరీ కి పాలు పోసే రైతుల సంఖ్య మరింతగా పెరిగి రైతులు, డెయిరీ భాగస్వామ్య పద్దతిలో నూతనంగా నిర్మిస్తున్న మెగా డెయిరీ కి అవసరమైన పాలను సునాయసంగా పొందే విధంగా విధివిధానాల తయారీ పై బోర్డు సమావేశం కూలంకషంగా చర్చించింది.

రాష్ట్రంలో లక్షాలాది మంది పాడిరంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. పాడి రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తిని, మేలుజాతి పాడి సంపదను పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు అనేక రకాలుగా ప్రభుత్వం చేయూతను అందిస్తుందని అన్నారు. విజయ డెయిరీ కి సక్రమంగా పాలు పోసే రైతులకు ముద్ర రుణాలు మంజూరు చేయించడం ద్వారా రైతులు అదనపు పాడి పశువులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని, తద్వారా వారు మరింత అభివృద్దిని సాధిస్తారని చెప్పారు.

అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మరో 6 నెలల్లో రంగారెడ్డి జిల్లా రావిర్యాల లో 250 కోట్ల రూపాయల వ్యయంతో 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న అత్యాధునిక మెగా డెయిరీ ప్రారంభం కానున్నదని, అందుకు అనుగుణంగా పాల సేకరణ జరగాల్సి ఉందని, దానికి గాను ఇప్పటి నుండే అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా విజయ డెయిరీ కి పాలు పోసే సొసైటీ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న వారిలో పాలు పోయని రైతులను గుర్తించి తొలగించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ప్రారంభించబోయే మెగా డెయిరీ లో వివిధ విభాగాలలో ఎంత మంది సిబ్బంది అవసరమో గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజీ పై ఒరిస్సా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు మరియు బాదంపాలు తదితర ఉత్పత్తులు గ్లాస్ బాటిల్స్ స్థానంలో పెట్ బాటిల్స్ ద్వారా సరఫరా చేసేందుకు బోర్డులో నిర్ణయించారు. అన్ని స్థాయిలలోని అధికారులు, సిబ్బందిని కార్యోన్ముఖుల్ని చేయడం ద్వారా విజయ డెయిరీ ని మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి ఆదిశలో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఎంతో బాధ్యతగా వ్యవహరించి సంస్థ అభివృద్ధి కి పాటు పడాలని సమావేశంలో ఆదేశించారు. విజయ డెయిరీ కి చెందిన పలు మిల్క్ చిల్లింగ్ కేంద్రాలు వివిధ కారణాలతో పని చేయడం లేదని, వాటిని గుర్తించి అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సమర్పించాలని అధికారులను సమావేశం ఆదేశించింది. డెయిరీ కి చెందిన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి అవి ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ఎంతో ప్రజాధరణ ఉన్నదని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేయాలని, అందుకోసం రానున్న ఏడాది కాలంలో అదనంగా మరో 3 వేల నూతన ఔట్ లెట్ లను ప్రారంభించడం ద్వారా 9 వేల నుండి 10 వేల మందికి ఉపాధి కల్పించే విధంగా బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఔట్ లెట్ లు సక్రమంగా నిర్వహించేలా, అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ అవసరమైన మార్పులు, చర్యలు చేపట్టాలని చెప్పారు.

విజయ డెయిరీ లో ఎంతో అనుభవం కలిగిన అధికారులు, సిబ్బంది ఉన్నారని, ప్రభుత్వ సహకారం కూడా ఉన్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని చెప్పారు. సంస్థ అభివృద్ధి సాధిస్తే సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం లభిస్తాయనే విషయాన్ని గుర్తించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్ లలో ఇతర సంస్థల ఉత్పత్తులు జరగకుండా చర్యలు తీసుకోవడం మార్కెట్ సామర్ధ్యం అనుసరించి ఉత్పత్తి సామర్ధ్యాన్ని నిర్ణయించుకోవడం ద్వారా మరియు ఇప్పటికే అందుబాటులో ఉన్న 28 రకాల పాలు, పాల పదార్ధాలతో పాటు రాబోయే రోజులలో వాటికి 100 రకాలకు పెంచడానికి సమావేశం నిర్ణయించింది. ఉంటున్నాయని, అదేవిధంగా విజయ డెయిరీ ఉత్పత్తులలో ఒకటి నెయ్యి పేరుతో నకిలీ లోగో లను తయారు చేసి విక్రయిస్తున్నారని, పాల కల్తీని అరికట్టడానికి విజయ డెయిరీ క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని మరింత పటిష్ట పర్చడానికి ఒక మొబైల్ క్వాలిటీ కంట్రోల్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.

ప్రజల ఆరోగ్యంపై ప్రాధాన దృష్టి సారించడానికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని డెయిరీ చైర్మన్ భరత్ కుమార్ చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో జీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిందని, శాఖ కు సంబంధించిన ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ తమ భూములలో గడ్డి పెంపకం చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. పశువుల కు సబ్సిడీ పై విజయ డెయిరీ ద్వారా సరఫరా చేస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రస్తుతం గద్వాల్ లో మాత్రమే ఉందని, రాష్ట్రంలో మరో 4 అనువైన ప్రాంతాలలో నూతన ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడి రంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఎలా ఆదుకోవాలి, వారికి ఏ విధమైన ప్రోత్సాహకాలు అందించాలనే విషయాలపైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విజయ డెయిరీ ని ప్రస్తుత పోటీ మార్కెట్ లో ప్రైవేట్ డెయిరీ లకు దీటుగా అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు అందరం కలిసికట్టుగా శ్రమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి చెందడం వలన పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా అనేకమంది నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఔట్ లెట్ లో కుల్ఫీ, ఐస్ క్రీం లు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఐస్ క్రీం ల విక్రయాల కోసం కొనుగోలు చేసిన పుష్ కార్ట్ లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ ఉత్పత్తులను వివిధ ప్రాంతాలలో తిరిగి విక్రయించే విధంగా, అదేవిధంగా తెలంగాణ లో అతిపెద్ద జాతర లు అయిన సమ్మక్క సారక్క, పెద్దగట్టు, కొమురెల్లి, ఏడుపాయల జాతర తదితర జాతరలకు, ఎగ్జిబిషన్, సంతలు, సమావేశాలు జరిగే ప్రాంతాలలో విజయ ఉత్పత్తులు అమ్మడానికి విజయ డెయిరీ 100 మొబైల్ ఔట్ లెట్ లను రానున్న రోజులలో ప్రారంభించాలని బోర్డు సమావేశం నిర్ణయించింది.

విజయ డెయిరీ ద్వారా ఉత్పత్తి అవుతున్న మినరల్ వాటర్ బాటిళ్ళ ప్లాంట్ సామర్ధ్యాన్ని 25 వేల లీటర్ల నుండి లక్ష లీటర్ల ప్యాకింగ్ పెంచే విధంగా చర్యలు చేపట్టాలని బోర్డు సమావేశం నిర్ణయించింది. NDDB, జైకా ప్రాజెక్టుల ద్వారా సాంకేతిక, ఆర్ధిక సహాయంతో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల పై కూడా బోర్డు చర్చించి ముందుకు వెళ్ళాలని నిర్ణయించింది. పర్యాటక స్థలాలు, దేవాలయాల వద్ద కూడా విజయ డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి ప్రణాలికలు రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. డిల్లీ, ముంబై మహా నగరాలలో విజయ పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ ఆధారంగా అక్కడి మార్కెట్ ను మరింత అభివృద్ధి పరిచి జిల్లాస్థాయి నుండి అమ్మకం, సరఫరా వ్యవస్థను పటిష్ట పరిచే విధంగా ప్రణాళికలను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది.

Leave a Reply