Home » గవర్నర్ గారూ.. విశాఖ భూములపై సిట్ రిపోర్టులు బహిర్గతం చేయండి

గవర్నర్ గారూ.. విశాఖ భూములపై సిట్ రిపోర్టులు బహిర్గతం చేయండి

– బీజేపీ ఎంపీ జీవీఎల్ లేఖ

విశాఖ భూ కుంభకోణంపై వేసిన సిట్ రిపోర్టులు బహిర్గతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. ఆ మేరకు ఆయన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇదీ..
గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్ గారి దివ్య సముఖమునకు,
విషయము: విశాఖపట్నంలో భూస్కాములపై నిర్వహించిన SIT రిపోర్ట్ లను బహిర్గతం చేయుట, మరియు సామాన్య ప్రజలకు విభాగం 22A నుండి ఉపసమనం కలిగించే విషయం – సంబంధించి

2019లో విశాఖపట్నంలో భారీ భూస్కాంను దర్యాప్తు చేయడానికి ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ప్రత్యేక విచారణ టీం SIT ను ఏర్పరచింది. గత సెప్టెంబర్ లో దానికి సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయబడినప్పటికీ ఇప్పటివరకు అది బహిర్గతం చేయబడలేదు. ఇదేవిధంగా గత టిడిపి ప్రభుత్వం కూడా విశాఖపట్నంలో జరిగిన భూ దందాలపై 2017లో ప్రత్యేక విచారణ టీం (SIT) ను నియమించింది. 2018లో SIT తన రిపోర్టును అప్పటి ప్రభుత్వానికి అందజేసినప్పటికీ అది కూడా సాధారణ ప్రజానీకానికి ఇప్పటివరకు తెలియజేయబడలేదు.

చూడబోతే విశాఖపట్నంలో భారీ స్థాయిలో జరిగిన భూ ఆక్రమణల మరియు భూ దందాల యొక్క కుంభకోణంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన ప్రముఖులను కాపాడటానికి వైసీపీ, టీడీపీ రాష్ట్ర ప్రభుత్వాలు అవి బహిర్గతం చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. దిగ్భ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే, దర్యాప్తు వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కంటే సామాన్య ప్రజలే విశాఖలో 22ఏ సెక్షన్ కింద వారి వారి భూములు చేర్చబడుటతో అన్యాయానికి గురయ్యారు. అందువల్ల, తమరు దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రథమ రాజ్యాంగ పరిరక్షకుని హోదాలో ప్రజా ప్రయోజనం ద్రుష్ట్యా సాధారణ ప్రజానీకానికి రక్షణ కల్పించి వారి ప్రాథమిక హక్కులను పరీక్షించే విధంగా తగు చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతున్నాను.

దానికిగాను…
1) గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు ఏర్పరచినటువంటి ప్రత్యేక విచారణ టీంలు (SIT) అందజేసినటువంటి రిపోర్టులను పూర్తిగా ప్రజలకు తెలిసే విధంగా బహిర్గతం చేయడం;
2) కొంతమంది స్వార్థపరులు ఆశించిన విధంగా కాక పట్టణ భూమి సీలింగ్ పరిధిలో ఉన్న దసపల్లా భూములు అన్యాక్రాంతం అవకుండా పరిరక్షించడం;
మరియు,
3) సుమారు 40 వేలకు పైగా మధ్యతరగతి, దిగుమధ్య తరగతి కుటుంబాలకు చెంది, జీవితాంతం శ్రమకోర్చి కష్టపడి సంపాదించుకున్న గృహాలను 22 ఏ రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా వారు అమ్ముకునే లేదా కొనే మరియు వారసులకు అందజేసే హక్కు లేకుండా ఉన్న బాధాకరమైనటువంటి పరిస్థితి నుండి 22 ఏ సెక్షన్ తొలగించే విధంగా అవసరమైన విధానము/ చట్టం చేయడం ద్వారా వారిని కాపాడటం, తద్వారా దిగుమధ్య తరగతి కుటుంబాలకు మేలు చేకూర్చడం;
4) వీటితో పాటు విశాఖపట్నంలో లక్షలాదిగా ఉన్న మురికివాడల్లో దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు కూడా నోచుకోకుండా నివసిస్తున్న పేద ప్రజలకు వారి గృహాలను బాగు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసే క్రూరమైన రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను తొలగించడం వంటి చర్యల ద్వారా లక్షల మంది పేద కుటుంబాలకు చెందిన వారికి మేలు చేయగలుగుతారు అని మీకు తెలియజేస్తున్నాను.
తమరి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తూ,

నమస్కారాలతో …
భవదీయుడు
జీవీఎల్ నరసింహారావు.

Leave a Reply