ఆరోగ్యమే మహాభాగ్యం!

రాకేశ్ జుంఝున్వాలా రాయని వీలునామా!

చివరి ప్రయాణం..
నీకైనా నాకైనా..
ఈ భూమ్మీద పుట్టిన ఎవరికైనా అనివార్యం..
నిజానికి ఈ ప్రపంచంలో ప్రతి మరణమూ ఒక కథే..అదోలాంటి వ్యధే!
కాని రాకేశ్ జుంఝున్వాలా
మరణం ఒక పాఠం..
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు నలభై వేల కోట్ల మహాసామ్రాజ్యానికి అధినేతగా మారి భారత
దేశ ఆర్థిక పరిస్థితుల
హెచ్చుతగ్గులను నిర్దేశించే ఒక వ్యవస్థగా ఎదిగిన పయనం ఒక చరిత్రే..
అయితే అంతకు మించి
ఈ రోజున రాకేశ్ విషయంలో ఎక్కువగా మాటాడుకుంటున్నది
అతడి మరణం గురించి..
నలభై వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా అతగాడు తన వెంట తీసుకు వెళ్ళలేకపోయాడన్నది ఇప్పుడు ప్రధానాంశం కాదు.
ఎవరి విషయంలోనైనా జరిగేది అదే..అయితే అంత సంపద కూడా రాబోయే ఆపదను వాయిదా వేయలేకపోయింది..
అతని ఆయుష్షును
ఒక్క నిమిషం కూడా పెంచలేకపోయిందన్నది కఠినాతి కఠినమైన నిజం..!

జనన మరణాలు దైవనిర్ణయాలు..
విధిలిఖితాలు అనేది ఎవరైనా అంగీకరించాల్సిన విషయమే అయినా
కొన్ని మరణాలు స్వయంకృతాలు!

నిజానికి రాకేశ్ జుంఝున్వాలా వయసు 62..అప్పుడే కన్ను మూసేంత పెద్ద వయసు కానే కాదు.,. అందునా అంత డబ్బున్న మనిషి.. ఎక్కడికైనా వెళ్లి
ఎంత ఖరీదైన వైద్యమైనా చేయించుకోగలిగే
స్థోమత..అయితే ముందే చెప్పుకున్నట్టు అతని కోట్లు అతని ఆయుష్షును ఒక్క లిప్తకాలమైనా గాని పెంచలేకపోయాయి..
వాస్తవానికి
ఆ తప్పు..వైఫల్యం
అతని సంపదది కాదు..
ఆ సంపద కోసం పరుగులు పెడుతూ జీవితాన్ని..అంతకు మించి విలువైన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన అతడిదే…
ఔను..ఖచ్చితంగా రాకేశ్ జుంఝున్వాలాదే..!

కొన్నేళ్ల క్రితం రాకేశ్ జుంఝున్వాలా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు.
ఇక్కడే మొదలైంది అసలు కథ.. అపశ్యం సూర్యం.. ఎండ తెలియని జీవితం..నడక మరచిపోయిన గమనం..నిద్రాహారాలు వేళపట్టున జరగనంత బిజీ.. మందు కంపల్సరీ గాని మందులు వేసుకోడానికి కూడా తీరిక ఉండని షెడ్యూల్స్..వీటన్నిటి ఫలితంగా ఆరోగ్యం చెడిపోవడం మొదలైన తర్వాత అతనికి తాను కోల్పోయిందేమిటో తెలిసి వచ్చింది..పోనీ అప్పుడైనా తన జీవన విధానంలో మార్పులు చేసుకున్నాడా అంటే అదీ లేదు.చీకటి పడగానే మందు.లేచి ఉన్నంత సేపు చేతిలో సిగరెట్టు..మొదటి పెగ్గులో మజా..సరదా సరదా సిగరెట్టు..ఇది దొరల్ తాగు భల్ సిగరెట్టు అనుకున్నాడే గాని అవే తనను మృత్యువుకు చేరువ చేస్తున్నాయని తెలుసుకోలేకపోయాడు..
అప్పుడప్పుడు అంతరాత్మ హెచ్చరిస్తున్నా లెక్క చెయ్యలేదు.రోజుకు ఆరు పెగ్గులు..ఇరవై అయిదు సిగరెట్లు..ఇంకేం..అవి చెయ్యాల్సిన చేటు చేసేసాయి.

సుగర్ లెవెల్స్ పైకి ఎగబాకి పోయాయి..ప్రధాని చేరువకు వచ్చినా లేచి పలకరించలేని దుస్థితి..అప్పుడు తెలిసింది అతగాడికి ఆరోగ్యమే మహాభాగ్యమని..
తన దగ్గర ఉన్న సంపద కంటే పోగొట్టుకున్న ఆరోగ్యం
ఎన్నో రెట్లు విలువైనదని..!

ఉన్న సంపద తరిగిపోతోందని..సంపాదించింది సరిపోదని తనతో పాటు తనలాంటి ఎందరో తెగ బాధపడిపోవడం
అప్పుడతడికి హాస్యాస్పదంగా అనిపించింది..తరిగిపోయే సంపద కంటే కరిగిపోయే కాలం గొప్పదని గ్రహించే లోగా ఆ కాలం అతడిని వెక్కిరించడం ప్రారంభించింది..
నోట్ల లెక్కలు పెరుగుతుంటే కాలం లెక్క తగ్గిపోయింది..
తను కూడబెట్టిన సొమ్ము తన వారే కాని..మరెవరైనా గాని దర్జాగా తింటుంటే
తాను కడుపునిండా తినగలిగే పరిస్థితి లేదు..
తనకు తెలుస్తోంది..
ఆరోగ్యం సారీ బాస్ అంటోందని.. ఆరోజు కాచుకుని ఉండని తెలుసు..కాకపోతే మరీ ఇంత తొందరగా..
అదీ హఠాత్తుగా ముంచుకొస్తుందని ఊహించలేదు…

తన పెట్టుబడితో నడిచే స్టార్ హెల్త్ లో చేరి ఎంతోమంది తమ వైద్యానికి అవసరమైన డబ్బులు సమకూర్చు కుంటుంటే చిటికెలో కోట్లు ఖర్చు పెట్టగలిగే రాకేశ్ నిస్సహాయుడిగా ప్రాణం వదిలాడు.కోట్లు ఖర్చుపెట్టినా తిరిగిరాని ఆరోగ్యం.. పెరగని
జీవిత కాలం..ఆగని మృత్యువు..!

తాను కట్టిన సౌధాలు..
కొనుక్కున్న విమానాలు…
కూడబెట్టిన నోట్ల కట్టలు..
షేర్లు..స్టార్ హోటళ్లు..
డజన్ల కొద్దీ కార్లు..
అంతులేని భూములు..
అన్నీ వదిలి..
ఏదీ వెంటరాని..
చివరి మజిలీ..
ఆరు అడుగుల భూమిలోకి చేరిపోయాడు
అపర కుబేరుడు..!
కోట్లు..ప్లాట్లు..
కన్నీటి బొట్లు రాల్చేదేలే..!!

నిన్ను ఆగనివ్వదు ఆశ..
నువ్వు ఆడమంటే ఆడేది కాదు నీ శ్వాశ..

ఈరోజు లేని డబ్బు రేపు రావచ్చు..
ఇప్పుడు పోయిన ఆరోగ్యం
ఎప్పటికీ రాదు..
రాకేశ్ జీ..
ఇది మీరు నేర్చకోని పాఠం..
మీ జీవితం ద్వారా మాకు చెప్పకనే చెప్పిన
గుణపాఠం!

ధనం మూలం ఇదం జగత్..
ఆ ధనం వెంటే వెధవ జగత్_
Money can buy many things..
But not everything..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

Leave a Reply