నీ ప్రశ్నకు నువ్వే జవాబు!

మురుగన్ హోటల్ ఎప్పుడూ బిజీనే..అక్కడ టీ,కాఫీ మొదలుకుని ప్రతి ఐటెం రుచికరం..అంతకు మించి శుచికరం..
ఆ రోజు శనివారం..బేరం మరీ జోరుగా ఉంది..సాయంత్రం నుంచీ ఒకటే రద్దీ..కౌంటర్ ఒక్క సెకెండ్ కూడా ఖాళీ లేదు.వచ్చే కస్టమర్లకు అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో చూసుకోవడం,వాళ్ళు బిల్లు కట్టే సమయానికి మళ్లీ కౌంటర్ దగ్గరికి వచ్చి నవ్వు ముఖంతో పలకరిస్తూ డబ్బులు తీసుకోవడం..ఎప్పుడూ లేనిది ఆయనలో కాస్త అలసట తొంగి చూసింది.

ఆ వెంటే కాస్త తలనొప్పి మొదలైంది. తగ్గిపోతుందిలే అని సర్దుకుంటున్నా తెరిపి లేదు.ఇక లాభం లేదని అక్కడే అన్ని పనులూ చూస్తున్న కొడుక్కి కౌంటర్ అప్పచెప్పి పక్కనే ఉన్న మందుల దుకాణానికి వెళ్లి, తలనొప్పి బిళ్ల ఒకటి వేసుకుని వెనక్కి వస్తూ అక్కడి అమ్మాయిని యథాలాపంగా మీ ఓనర్ గారు ఎక్కడమ్మా అని అడిగారు.ఆ అమ్మాయి బదులిస్తూ”సార్ కి కొంచెం తలనొప్పిగా ఉండి కాఫీ తాగి వస్తానని మీ హోటల్ కే వచ్చారయ్యా”అంది.

చూసారా చిత్రం..అక్కడి నుంచి ఆయన ఇక్కడికి..ఇక్కడి నుంచి ఆయన అక్కడికి..సమస్య ఒక్కటే..నివారణ ఇద్దరి దగ్గరా ఉన్నా ఒకరి చోటికి మరొకరు వెళ్లడం..ఇదే మరో రకంగా చెప్పుకుంటే..మనం ప్రశాంతత కోసం ఎన్నో చోట్లకు వెళ్తాం.తీర్థ విహార యాత్రలు..గుళ్ళు గోపురాలు…కానీ వెతుక్కొగలిగితే అది మనలోనే దొరుకుతుందని తెలుసుకోం.మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకు,సమస్యలకు
ఒకటే జవాబు ..
అదే అంతరాత్మ
అది అర్ధం కాదు మనకు..!

అనువాదం
సురేష్ ఎలిశెట్టి

Leave a Reply