Home » విశాఖ పోర్టు పనితీరును అభినందించిన జీవీఎల్

విశాఖ పోర్టు పనితీరును అభినందించిన జీవీఎల్

ఇటీవల కాలంలో భారీ స్థాయిలో పనితీరు మెరుగుదల కనపరచిన విశాఖ పోర్ట్ అథారిటీ (వీపీఏ) ప్రపంచ ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. 2023 సంవత్సరానికి తాజా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (విపిఎ) 62.29 ఇండెక్స్ పాయింట్లతో 20 వ స్థానాన్ని, మరియు కంటైనర్ పోర్ట్ పనితీరు సూచికలో 19వ స్థానాన్ని పొందడం పోర్టు యొక్క అద్భుతమైన పనితీరుకు నిదర్శనం.

ఒక సంవత్సరంలోనే 102 స్థానాలు ఎగబాకి ప్రస్తుత స్థానానికి చేరుకోవడం నౌకాశ్రయం యొక్క గణనీయమైన పురోగతి మరియు అభివృద్ధిని స్పష్టంగా తెలియచేస్తుంది అని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వశాఖ తన ఎక్స్ లో పోస్ట్ పేర్కొనడం జరిగింది.

సముద్ర వ్యాపారంలో ఒక ముఖ్యమైన ప్రమాణంగా భావించే సూచిక అయిన నౌకలు రేవులో ఉండే కాలాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ నౌకాశ్రయాల సామర్థ్యాన్ని కంటైనర్ పోర్ట్ పనితీరు సూచిక కొలుస్తుంది.

దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ప్రధాన ఓడరేవుల్లో ఒకటైన విశాఖ పోర్టు అథారిటీ అత్యుత్తమ పనితీరును గుర్తించడం విశాఖకు గర్వకారణమనీ, కీలకమైన పనితీరు ద్వారా గ్లోబల్ ర్యాంకింగ్స్ లో గణనీయమైన మెరుగుదల చూపించదానికి కారణమైన చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తుకు, తక్కువ కాలంలోనే ఇంతటి అద్భుతమైన పనితీరు కనబరిచిన పోర్టు అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు’ అని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.

అంతకుముందు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (విపిఎ) 2024 మేలో 221 నౌకల నుండి 85.82 లక్షల మెట్రిక్ టన్నుల సరుకును నమోదు చేయగా, ఈ ఏడాది మార్చిలోనే మునుపటి గరిష్ట పరిమాణం 76.23 లక్షల మెట్రిక్ టన్నులను అధిగమించడం జరిగిందనీ, 2023 నుంచి విశాఖ పోర్టు పనితీరు, ట్రాఫిక్ పరిమాణాల్లో స్థిరమైన మెరుగుదల కనిపించిందని, ఇది పోర్టు మరియు విశాఖ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

Leave a Reply