ప్రజాగర్జనను డైవర్ట్‌ చేయటానికే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర

-చంద్రబాబుకు మేలు చేయడమే పవన్‌ ఉత్తరాంధ్ర యాత్ర
-పవన్‌ కళ్యాణ్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజలు గమనిస్తున్నారు
-ఇకనైనా పవన్‌కళ్యాణ్‌ తన వైఖరి మార్చుకోవాలి
-మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టీకరణ

తుని: ప్రెస్‌మీట్‌లో మంత్రి దాడిశెట్టి రాజా ఏం మాట్లాడారంటే..:
అదే చంద్రబాబు లక్ష్యం:
వికేంద్రీకరణ రాష్ట్ర ప్రజల కోరిక అయితే.. రాష్ట్ర సంపద బినామీలకు దోచిపెట్టడమే చంద్రబాబు లక్ష్యం. ఇప్పటికే ఆంధ్ర, రాయలసీమ వాసులు రెండుసార్లు మోసపోయారు. గతంలో మద్రాస్‌ నగరాన్ని కోల్పోగా, మొన్న హైదరాబాద్‌ కూడా పోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా.. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుకు కోట్ల కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చారు. ఇక్కడికి వచ్చాక బినామీలకు రాష్ట్ర సంపద ఎలా దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేశారు.

పవన్‌ అనైతిక ట్వీట్స్‌:
విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు సాధనలో భాగంగా ఈనెల 15న విశాఖలో గర్జన ర్యాలీ తలపెట్టారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటైన జేఏసీ ఆ నిర్ణయం తీసుకుంటే, మా పార్టీ విధానం కూడా అదే కాబట్టి, ర్యాలీకి మద్దతు ప్రకటించాం. అయితే.. ‘ఎవరి కోసం ఈ గర్జన’ అంటూ పవన్‌కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ కోసం ప్రజలతో కలిసి పని చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న పవన్‌ కల్యాణ్, అహంభావంతో వరసగా ట్వీట్లు చేస్తున్నారు. అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన చంద్రబాబు బినామీలు 150 మంది మాత్రమే, అక్కడే మొత్తం రాజధాని ఉండాలని కోరుతున్నారు. దాన్ని ఎండగట్టే హక్కు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఉంది. ఆ దిశలోనే వికేంద్రీకరణ ఉద్యమం క్రమంగా ఊపందుకుంటోంది.

పవన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌:
రాజధానిపై ఎక్కడికక్కడ అనుకూలంగా మాట్లాడిన పవన్‌కళ్యాణ్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకునే పవన్‌ మాత్రమే బాగుంటే సరిపోతుందా? పన్నుల రూపంలో వచ్చే ప్రజాధనాన్ని 200 ఏళ్ల పాటు ఒక్క అమరావతిలోనే ఖర్చు చేయాలని పవన్‌కళ్యాన్‌ కోరుకుంటున్నారు. తన కోరికకు ఎవ్వరూ అడ్డు తగలకూడదన్న భావంతో పవన్‌ వ్యవహరిస్తున్నారు.

ఆయనకు ‘సిగ్గు’ లేదు:
2014 ఎన్నికల్లో చంద్రబాబుకు బహిరంగంగా మద్దతు ఇచ్చినప్పటి నుంచి స్థిరత్వం లేని పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఎల్లో మీడియతో కలిసి ఆయన చేసిన డైవర్షన్‌ పాలిటిక్స్‌ను గుర్తించే 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన వారెవరైనా.. ఏ మానవమాత్రుడైనా అలాంటి తీర్పుతో సిగ్గు పడతారు. కానీ దేవుడు పవన్‌కు సిగ్గు పెట్టలేదు. అందుకే అప్పుడప్పుడు బయటకు వచ్చి, రాజకీయాలు చేస్తూ ప్రవచనాలు చెబుతున్నాడు.

ఎవరి కోసం ఆ యాత్ర?:
పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల మనస్సులో ఏముందో తెలియజేయటానికి ఈనెల 15న విశాఖలో భారీ ర్యాలీ ‘ప్రజా గర్జన’ నిర్వహిస్తుంటే.. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న పవన్‌కళ్యాణ్‌ దాన్ని డైవర్ట్‌ చేయడం కోసం అదే రోజు ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నాడు. జనవాణిలో పాల్గొంటున్నట్లు ప్రకటించాడు. పవన్‌ స్వార్థ రాజకీయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.

ఇదే నా సవాల్‌..:
రాష్ట్ర ప్రజలంతా అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. కానీ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలవారు మినహా, ఎవ్వరూ అది కోరుకోవడం లేదు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు కూడా పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వాలి. లేకపోతే తన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, మళ్లీ ప్రజల తీర్పు కోరాలి. మీ ఎమ్మెల్యేలలో ఒక్కరు నెగ్గినా మేము వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంటాం.
ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేకపోతే, కనీసం చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇద్దరైనా రాజీనామా చేసి గెలవాలి. అప్పుడు ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని మేము భావిస్తాం. ఇది నా సవాల్‌. మీకు ఆ దమ్ముందా? రాజీనామాలు చేస్తారా?.

రోడ్లపై దుష్ప్రచారాలు:
రాష్ట్రంలో వరసగా భారీ వర్షాలకు అక్కడక్కడా రోడ్లు ధ్వంసమైతే వాటిపై ఎల్లో మీడియా అదే పనిగా దుష్ప్రచారం చేస్తోంది. ఆ కధనాలు చూపుతూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజానికి గత ప్రభుత్వ హయాంలో పెద్దగా రోడ్ల నిర్మాణం జరగలేదు. అక్కడక్కడ వేసినా నాణ్యతా లోపం వల్ల కనీసం పదేళ్లు ఉండాల్సిన రోడ్లు మూడేళ్లకే ధ్వంసమయ్యాయి. అందువల్ల ఇప్పుడు రోడ్ల దుస్థితికి చంద్రబాబే కారణం.

రూ.1500 కోట్లతో మరమ్మతులు:
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడికక్కడ మరమ్మతులు చేస్తూనే ఉన్నాం. రోడ్ల మరమ్మతుల కోసం సీఎంగారు రూ.1500 కోట్లు కేటాయించారు. ఇప్పటికే పనులు మొదలు కాగా, వచ్చే ఏడాది మార్చి నాటికి వాటిని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆ మరమ్మతులు పూరై్తతే మరో రూ.1500 కోట్లు కూడా ఇస్తామని సీఎంగారు చెప్పారు. నిజానికి నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా రోడ్ల మరమ్మతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేయలేదు. రాష్ట్రంలో తరుచూ భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయి.

వాటిని ఏనాడైనా చూపారా:
రాష్ట్రంలో రోడ్లు బాగా లేవంటూ చూపుతున్న ఎల్లో మీడియా.. నాడు–నేడు కింద ఎంతో బాగు చేసిన రోడ్లను ఏనాడైనా చూపిందా? ఆ రోడ్లు చంద్రబాబుకు కానీ, ఆయన దత్తపుత్రుడికి కానీ అస్సలు కనిపించవు. మరమ్మతులు చేయని రోడ్లను అద్దంలో పెద్దగా చూపడం, బాగున్న రోడ్లకు గోతులు తవ్వి.. వాటిని పూడుస్తున్నట్లు దత్తపుత్రుడు నాటకాలు ఆడుతుంటే.. ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా గుర్తు చేశారు

Leave a Reply