Home » తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు

వచ్చేనెల 1 నుంచి పంపిణీ

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో ఈనెల 12వతేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్రస్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు పంపారు. ఈనెల 20వతేదీ నుంచి రేషన్‌ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది.

దీంతో పౌరసరఫరాల శాఖ ఆధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో దించిన చెక్కర, కందిపప్పు నాణ్యతతోపాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. వచ్చేనెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు.

Leave a Reply