Home » పౌరాణిక పౌరోహితుడు కమలాకర కామేశ్వరరావు

పౌరాణిక పౌరోహితుడు కమలాకర కామేశ్వరరావు

పౌరాణికబ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వరరావు …

(చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం.” -కమలాకర కామేశ్వరరావు.)

సినీ ఫ్యాన్‌ పేరుతో రివ్యూలు రాశారు.. చంద్రహారంతో సినీ రంగ ప్రవేశం చేశారు.. నర్తనశాలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చారు.. #పౌరాణికబ్రహ్మ పేరు సంపాదించారు.. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలలో #శిరోమణి అవార్డు అందుకున్నారు.
పౌరాణిక చిత్రాల బ్రహ్మ గా గుర్తింపు పొందిన దర్శకుడు. సాంఘిక చిత్రాల మాటెలా ఉన్నా తెలుగు పౌరాణిక చిత్రాలకు సాటి రాగల పౌరాణికాలు యావద్భారతదేశంలోనే మరే భాషలోనూ లేవు. తెలుగు పౌరాణికాలకు ఆ ఘనతను సాధించి పెట్టారు.సినిమాలలో బిజీగా ఉన్నా ఏనాడూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు..ఆయనే దర్శకులు కమలాకర కామేశ్వరరావు…..

తొలి జీవితం:
కమలాకర కామేశ్వరరావు 1911, అక్టోబర్ 4 న బందరులో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది.
బందరు నోబుల్‌ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. ఆ రోజుల్లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో రెండే కాలేజీలు…. మద్రాసులో లేదంటే మచిలీపట్టణంలో చదవాలి. ఏ ఉద్యోగానికీ ప్రయత్నించలేదు. చిత్రాల్లో ప్రవేశించాలనేది ఆయన ధ్యేయం. ఆ ధ్యేయంతోనే సినిమాలు చూస్తూ చిత్రాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ వుండేవారు.
అప్పట్లో ఇంట్లో కరెంటు లేదు. పుస్తకాలు కొనుక్కునే స్థాయి కూడా లేదు. పెద్దయ్యాక మాత్రం చాలా పుస్తకాలే కొన్నారు. ఇంట్లో ఒక బీరువాలో ఇంగ్లీషు పుస్తకాలు, మరొక బీరువాలో తెలుగు వేదాంత గ్రంధాలు ఉండేవి. పిల్లల పుస్తకాలు కొనేవారు.
‘మచిలీపట్టణం చరిత్ర’ పుస్తకంలో కమలాకర కామేశ్వరరావు గారు గురించి ఒక #పేజీ రాశారు.

సినీ విమర్శకునిగా:
కృష్ణా పత్రికలో ‘సినీఫాన్’ అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూ థియేటర్స్, ప్రభాత్ వారి హిందీ సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. ‘గుడ్ ఎర్త్ ‘ అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు.
ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శల్ని చదివి, వాటిలో ‘బాగుంది’ అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు, సంపాదకుడు అయిన ముట్నూరు కృష్ణారావు కామేశ్వరరావు గురించి “మా సినీఫాన్” అని గర్వంగా చెప్పేవాడు.
ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన “ద్రౌపదీ వస్త్రాపహరణం”, “ద్రౌపదీ మానసంరక్షణం” చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి.

సినిమా రంగ ప్రవేశం:
గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరాడు. రోహిణీలోచేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు పరిచయమయ్యారు. కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూతప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు. గృహలక్ష్మి చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీవారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పని చేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియో గాపేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో #కామేశ్వరరావు ఒకడు.

పాండురంగ మహత్యం, గుండమ్మ కధ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ తులాభారం, బాల భారతం లాంటి ఎన్నోఅపురూపమైన పౌరాణిక, సాంఘీక చిత్రాలను మనకి అందించిన పౌరాణిక బ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వర రావు గారుసదా అభినందనీయుడు.

నిరాడంబరుడు:
మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, పాండురంగ మహాత్యం, నర్తనశాల, గుండమ్మకథ వంటి ఎన్నో చిత్రాల్ని డైరక్టుచేసిన కమలాకర కామేశ్వరరావు అతి నిరాడంబరంగా వుండేవారు. ”ఆయన్ని చూస్తే ఎవరో స్కూలు మాస్టారు అనిపిస్తారుగాని, సినిమా దర్శకుడు అనిపించడు” అనేవారు ఆ రోజుల్లో. నిత్యం తెల్లని పంచె, జుబ్బా వస్త్రధారణ. ”చిన్నతనంలో లాగులు వేసుకునే వాడిని. కాలేజి చదువుకు వెళ్లిన దగ్గర్నుంచి పంచెలతోనే వెళ్లేవాడినిగాని, పాంటు ఎప్పుడూ వేసుకోలేదు” అని చెప్పాడొకసారి. ఎన్ని సినిమాలు, హిట్‌ సినిమాలు చేసినా, నిర్మాత ఎంత ఇస్తే అంతే తీసుకున్నారుగాని, ”ఇంత ఇస్తే గాని చెయ్యను” అని ఏనాడూ అనలేదు! అందుకే కాబోలు ఆ రోజుల్లో ఆయనతోపాటు వున్న దర్శకులందరికీ సొంత కారున్నా ఆయనకి మాత్రం ఎప్పుడూ కారులేదు. అలాగే, సొంత ఇల్లూ లేదు. నియమ నిష్ఠలు, దైవభక్తీ ఎక్కువ. వ్యసనం అనేది ఏదీ ఆయన దగ్గరకి కూడా రాలేదు. ఎవరితోనూ ‘మాటా మాటా’ రావడం కూడా లేదు. తన దగ్గర పనిచేసిన సహాయకులందర్నీ కూడా ‘మీరు’ అనే సంబోధించేవారు.

సినిమా కంపెనీలకి వెళ్లాలన్నా- షూటింగ్‌కి వెళ్లాలన్నా వాళ్లు చెప్పిన వేళకి- సిద్ధమై గుమ్మంలో నించునేవారు. షూటింగ్స్‌ లేకపోతే, నిత్యం పుస్తక పఠనం. ”కె.వి.రెడ్డి గారి తర్వాత, స్క్రీన్‌ ప్లే రూపొందించడంలో కామేశ్వరరావుగారే” అని చెప్పుకునేది పరిశ్రమ. నటులు, ఇతరులూ అందరూ కామేశ్వరరావు గారిని ఎంతో పూజ్యభావంతో చూసేవారు. ఎప్పుడోగాని కోపం వచ్చేది కాదు ఆయనకి. నిత్యం నవ్వుతూ, శాంతంగా వుండేవారు. స్క్రిప్టు క్షుణ్ణంగా తయారుచేసుకుని షూటింగ్‌కి వచ్చేవారు. వాహినీ సంస్థలో వున్నప్పుడు అక్కడివారంతా ఆయన్ని ‘ధర్మరాజు’ అనేవారు.

సహస్ర చంద్ర దర్శనం…
వెయ్యి పున్నములు చూసిన వారికి ఒక భోగం జరుపుతారు. అందుకు ఆరోగ్యం, భార్య రెండూ ఉండాలి. ఆ రెండూ నాన్నగారికి ఉన్నాయి కనుక, ఆయనను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాం. ‘శతమానం భవతి’ అని వంద మందిని మాత్రమే పిలవమన్నారు.ఆయన కింద కూర్చోలేరేమో అనుకున్నాం, కానీ, మా అందరికీ ఆనందం కలిగించేలా చక్కగా చేయించుకున్నారు. ఆయన పిల్లలుగా పుట్టే అదృష్టం మాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఆ ఒక్క వేడుకైనా చేయ గలిగినందుకు సంతోషపడ్డాం అంటారు వారి పిల్లలు.

ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
నర్తనశాల’చిత్రానికి జాతీయస్థాయిలో రెండో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారి దక్కిన గౌరవం అది.నర్తనశాల ఎంతో పేరుతెచ్చుకుని జకార్తాలో కూడా ప్రదర్శింపబడింది.
కె.రాఘవేంద్రరావు తన డిగ్రీ పూర్తికాగానే తొలుత కమలాకర కామేశ్వరరావు వద్దనే సహాయ దర్శకుడిగా పనిచేశారు.
ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందజేసి గొప్ప రివార్డులు అందుకున్న కమలాకర కామేశ్వరరావుగారు 1998 జూన్ 29న మరణించారు.
పురాణగాథలను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికించిన కామేశ్వరరావు ‘ పౌరాణిక బ్రహ్మ’గా కీర్తిపొందారు. ఆయన రూపొందించిన చిత్రాలు నేటికీ పర్వదినాల సమయంలో బుల్లితెరపై ప్రత్యక్షమై మనకు కనుల విందు చేస్తుంటాయి.

Collected by
Dr.A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Palanadu district.

Leave a Reply