తెలుగు నాటక రంగానికి పండుగరోజు నంది నాటకోత్సవాలు

• రంగస్థలానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ లో నంది నాటకోత్సవాలు
• అక్టోబర్ లో 7 రోజుల పాటు జరిగే నంది నాటకోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
• 5 విభాగాల్లో 73 నంది అవార్డులు ప్రదానం.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల.. నెల పాటు దరఖాస్తుల స్వీకరణ.. ఉపసంహరణకు వారం గడువు
• నంది నాటకోత్సవాలకు అందరికీ అనుకూలంగా ఉండే వేదికను త్వరలోనే నిర్ణయిస్తాం
• నంది నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పం
• నాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి
– నంది నాటకోత్సవ నిర్వహణ అంశంపై నాటక రంగ ప్రముఖులతో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి భేటీ

ఈ ఏడాది నంది నాటకోత్సవాల్లో (రంగ స్థల పురస్కారాలు) భాగంగా 5 విభాగాల్లో 73 అవార్డులను ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ మరియు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మొదటి అంతస్థులోని ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్ లో నంది నాటకోత్సవాలు, నిర్వహణ అంశంపై పలువురు నాటక రంగ ప్రముఖులతో ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి భేటీ అయి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన నాటక రంగ కళాకారులకు రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎల్.ఎన్.శేషసాయి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు నాటక రంగం దేదీప్యమానంగా వెలగాలని, రంగ స్థలానికి పునర్ వైభవం తీసుకురావాలన్న సత్ సంకల్పలంతో, సమాజాన్ని ప్రతిబింబించే నాటికలకు ప్రోత్సాహకంగా ఈ ఏడాది నంది నాటకోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు.

పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల ప్లేలెట్ లు, కళాశాల లేదా యూనివర్సిటీ ప్లేలెట్ లు అనే ఐదు విభాగాలల్లో అవార్డులు అందజేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను 5 జులై, 2023 న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దరఖాస్తులకు నెల రోజుల సమయం (5 ఆగస్టు, 2023 వరకు) ఇచ్చామన్నారు.

ఏ కారణం చేతనైనా ఎంట్రీలను ఉప సంహరించుకోవాలంటే అందుకు వారం రోజులు గడువు (12 ఆగస్టు, 2023 వరకు) కేటాయించామన్నారు. అందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని నంది నాటకోత్సవాలకు వేదికగా ఎంపిక చేస్తామన్నారు. నాటక రంగ కళాకారులు అందరూ ఏదైనా అనువైన ప్రాంతాన్ని సూచిస్తే ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. కళే శ్వాస, ధ్యాసగా బతికే ఎంతో మంది కళాకారులకు ఇదొక మంచి అవకాశం అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2018 నుండి 2022 వరకు వివిధ నాటక సమాజాల నుండి ప్రదర్శించిన నాటకాలను ఈ ఏడాది నిర్వహించే నంది నాటకోత్సవాల్లో ఎంట్రీలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంట్రీలను స్వీకరించి ప్రాథమిక న్యాయ నిర్ణేతల ద్వారా స్క్రూటినీ చేసి తుదిపోటీలకు 10 పద్యనాటకాలు, 6 సాంఘీక నాటకాలు, 12 సాంఘీక నాటికలు, 5 బాలల నాటికలు, 5 కళాశాల లేదా యూనివర్సిటీ యువత నాటికలను ఎంపిక చేస్తామన్నారు.

దరఖాస్తుల సంఖ్యను బట్టి వీటి సంఖ్యను పెంచే అంశాన్ని ఆలోచిస్తామన్నారు. బాలలు, యువతకు సంబంధించిన నాటకాలకు సంబంధించి ఈ ఏడాది కొత్తగా ప్రదర్శించిన వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం ప్రదర్శనలు ఉండేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలన్నారు. నాటక సమాజాలు, వాటి నిర్వాహకులు, రచయితలు, దర్శకులు, నటీనటులు తదనుగుణంగా సిద్ధమవ్వాలని సూచించారు.

ప్రదర్శన ఎంపిక సమయంలో నాటక రంగ కళాకారులుండే ప్రాంతానికే వచ్చి తమ జ్యూరీ బృందం అన్ని అంశాలను పరిశీలిస్తుందన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఆంధ్రప్రదేశ్ లో తమకు అనుకూలమైన ప్రాంతాన్ని సూచిస్తే అక్కడికే తమ జ్యూరీ బృందం వారి వద్దకే వచ్చి ప్రాథమిక పరిశీలన చేస్తుందన్నారు. సరికొత్త కథాంశాలతో, మన సంస్కృతీ సంప్రదాయాలను, మానవతా విలువలను, ఉన్నతమైన జీవనాన్ని ప్రతిబింబించే అంశాలతో కూడిన అంశాలకు కళాకారులు ప్రాధాన్యతివ్వాలన్నారు.

2017 లో చివరిసారిగా నంది నాటకోత్సవాలు నిర్వహించామన్నారు. అనంతరం కరోనా విపత్కర పరిస్థితులు, ఇతరత్రా కారణాల వల్ల నంది నాటకోత్సవాలు నిర్వహించలేకపోయామన్నారు. ఈ ఏడాది నంది నాటకోత్సవాలను సమర్థవంతంగా, గతంలో కన్నా మరింత మెరుగ్గా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

ఏటేటా అందించే నంది పురస్కారాలతో నాటకరంగం నిత్యనూతనంగా వర్ధిల్లాలని, ఘన కీర్తి కలిగిన తెలుగు నాటక రంగ కీర్తి పతాకను ఎగరవేయాలని విజయ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. కళాకారులకు ఆర్టీసీ ఛార్జీల రాయితీ విషయాన్ని సంబంధిత విభాగంతో చర్చిస్తామన్నారు. వివిధ నాటక సమాజాల నుంచి పలువురు నాటక రంగ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎల్.ఎన్.శేషసాయి మాట్లాడుతూ నంది నాటకోత్సవాల్లో భాగంగా ఆరు రోజులు పోటీలు నిర్వహించి ఏడో రోజు అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. కళారాధన సమితి కార్యదర్శి డా. రవికృష్ణ నంద్యాల మాట్లాడుతూ నంది నాటకోత్సవ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. అనేక కారణాలతో వాయిదా పడిన నంది నాటకోత్సవాలను ఐదేళ్ల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమన్నారు. నంది నాటకోత్సవాలను తెనాలిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పిల్లలను పద్యానికి దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఎన్టీఆర్ సాఫల్య పురస్కారంతో సమానంగా బళ్లారి రాఘవ అవార్డుకు కూడా గౌరవం ఇస్తే బాగుంటుందన్నారు. నంది నాటకోత్సవాల్లో భాగంగా పోటీలకు వచ్చే నాటికల స్క్రిప్ట్ లను ప్రాథమిక దశలోనే పరిశీలించి స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.పలువురు నాటక రంగ ప్రముఖులు నంది నాటకోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించారు.

కార్యక్రమం అనంతరం “తెలుగు పద్యనాటక రంగం- సాంకేతికత-సమకాలీన అధ్యయనం” అంశంపై ఆర్.నిరుపమ సునేత్రి రచించిన పుస్తకాన్ని ఎఫ్ డీసీ ఎండి విజయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాటక రంగ ప్రముఖులు, ఎఫ్ డీ సీ, కల్చరల్ విభాగం, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, తదితరులు హాజరయ్యారు.

Leave a Reply