Home » పల్లిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

పల్లిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

– గాంధీ ఆశ్రమంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి
– స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు మనకు ఆదర్శం కావాలి
– పల్లిపాడుతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని వ్యాఖ్య
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

కోవూరు: నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డిగారికి…. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ నిర్వాహకులు పుష్ప గుఛ్ఛాలతో ఎమ్మెల్యే గారిని సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారి త్యాగాలను మననం చేసుకుంటూ వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలోని గాంధీజీ, స్వాతంత్ర పోరాట యోధురాలు పొణకా కనకమ్మ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పినాకిని ఆశ్రమ ఆడిటోరియంలో విద్యార్ధినీ విద్యార్ధులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రశాంతిరెడ్డిగారు మాట్లాడుతూ… మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు సిద్ధాంతాలు వేరైనా ఇద్దరి లక్ష్యం స్వాతంత్ర సాధనే అన్నారు. గాంధీజీ అహింసావాది, సీతారామరాజు విప్లవ యోధులు. అలాంటి ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు కలిగిన త్యాగధనుల త్యాగాలను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తానన్నారు.

అహింసవాది గాంధీజీ ఆశ్రమంలో విప్లవ యోధులు సీతారామరాజు గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన అల్లూరి సీతారామరాజు గారి త్యాగ నిరతిని ఆమె కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి జీవితం భావితరాలకు ఓ పాఠం లాంటిదన్నారు.

పల్లిపాడు గ్రామంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ గ్రామాన్నిగాంధీజీ, జిడ్డు కృష్ణమూర్తి ఆశయాలకు ప్రభావితులైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. విపిఆర్ గారు దాదాపు 2 కోట్ల 72 లక్షల రూపాయలు వెచ్చించి హిందూ స్మశాన వాటిక అభివృద్ధి, అక్కడి వరకు సీసీ రోడ్డు, హిందూ స్మశాన వాటికలో భవనం లాంటి ఎన్నో సదుపాయాలు కల్పించారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ విపిఆర్ సహకారంతో పల్లిపాడు వద్ద పెన్నానదికి కరకట్టలు నిర్మాణానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ గ్రామంలో చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని, తప్పకుండా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

ఎన్నికల సమయంలో పల్లిపాడు గ్రామం తమకు చాలా మద్దతుగా నిలిచిందని, మంచి మెజార్టీ ఇచ్చి తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించిన పల్లిపాడు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు వీరేంద్రనాయుడు, ఆశ్రమ నిర్వాహకులు నెల్లూరు రవీంద్ర రెడ్డి, ముఖ్య నాయకులు చెంచు కిషోర్‌, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, చప్పిడి శ్రీనివాసులు, డేవిస్‌పేట మధు, రావూరు గోపాల్‌, సుధాకర్‌రెడ్డి, బెజవాడ సుధాకర్‌రెడ్డి, బండ్ల మల్లిఖార్జున్‌, సోమయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply