Home » జనరంజక పాలనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జైత్రయాత్ర

జనరంజక పాలనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జైత్రయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరంజక పాలన మూడున్నరేళ్లు దాటిన సంవత్సరం 2022. అనేక రాజకీయ, ఆర్థిక సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వలోని రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర రీతిలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2019 మే ఆఖరులో అనేక ప్రజాసంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చిన ఈ సర్కారు తన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తూ ప్రజల్లో నవచైతన్యాన్ని నింపింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో నలిగిపోయిన ప్రజలకు చెప్పలేనంత ఊరట కల్పించింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ దుందుడుకు వైఖరి వల్ల అక్కడక్కడా రాజకీయ గొడవలు జరిగినా అవి వెంటనే సద్దుమణుగేలా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ సర్కారు పాలనపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నా నవ్యాంధ్రలో ఆయన పాలనలో లేని శాంతి భద్రతలు ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిరంతరం జనామోదంతో ప్రజల మనస్సుల్లో పాలకపక్షం పాతుకుపోవడం చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోయి మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. కిందటేడాది చివరి మాసాల్లో ఆయన ‘2024లో జరిగేవి నాకు చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. నన్ను మీరు గెలిపించి అధికారం అప్పగించకపోతే’–అనే రీతిలో చంద్రబాబు చాలాసార్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి అయ్యే చివరి అవకాశం తనకు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే రాష్ట్రానికే అవి తుది ఎన్నికలవుతాయని ప్రజలను భయపట్టే ప్రయత్నం చేశారు బాబు గారు. అలాగే, టీడీపీ నీరసించిపోయిన కారణంగా– అన్ని పార్టీలు కలిస్తే తప్ప వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గట్టిగా ఢీకొనలేమనే కొత్త థియరీని ఆయన రంగం మీదకు తీసుకొచ్చారు. ప్రస్తుత పాలకపక్షం ‘ఓడిపోతే’ ఈ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానంటూ నారా వారు అబద్ధాలు అవలీలగా జనం మీదకు విసురుతున్నారు.

2022 సంవత్సరం తెలుగు ప్రజలకు పరీక్షా సమయంలా గడిచింది. ఈ పరీక్షలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవంతంగా నిలిచింది. ప్రధాన ప్రతిపక్షానికి దాని స్థానమేంటో చూపించింది. సరిగ్గా ఏడాది నాలుగు నెలల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల గురించి మరీ మితిమీరి ఆలోచించకుండా జన సంక్షేమమే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతోంది జగన్‌ గారి ప్రభుత్వం. ‘రాష్ట్రాన్ని కాపాడుతా నన్ను గెలిపిస్తే’ అంటూ చంద్రబాబు తన జిత్తులమారి మాటలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని ఇకనైనా తెలుసుకుంటే మంచిది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన విలువ తెలుసుకున్న ఆంధ్ర ప్రజానీకం– ఏడాది తర్వాత మరో ఐదేళ్ల జనరంజక పాలనకు అవకాశం ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2023లో కూడా గత మూడున్నరేళ్ల సుపరిపాలన మరింత విజయవంతంగా సాగుతుందన్న ప్రజల అంచనాలు, ఆశలు తప్పక నిజమవుతాయి.

Leave a Reply