Home » ప్రజల భూములు దోచుకోవడానికే తుగ్లక్ చట్టాలు

ప్రజల భూములు దోచుకోవడానికే తుగ్లక్ చట్టాలు

– మాజీమంత్రి దాడి వీర భద్రారావు

దొంగ చేతికి తాళాలు అప్పగించిన విధంగా ప్రజల రెవెన్యూ రికార్డులు మొత్తం వైసీపీ నేతలకు అప్పగించేందుకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌, భూ సమగ్ర సర్వేలను  వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు ప్రజల రెక్కల కష్టంతో సంపాదించిన ఆస్తులు దోచుకోవడానికే. న్యాయ వ్యవస్థను కాదని రెవెన్యూ వ్యవస్థకు ఏ విధంగా అధికారం ఇస్తారు?

రెవెన్యూ శాఖకు అధికారాలు అప్పగిస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఏ విధంగా ఉంటుంది? న్యాయస్థానాల్లో పరిష్కరించాల్సిన వివాదాలను రెవెన్యూశాఖ పరిష్కరించేలా ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులకు, వారసత్వంగా వచ్చిన ఆస్తుల పట్టాల్లో కూడా జగన్‌ బొమ్మను ఏ విధంగా ప్రచురిస్తారు? సర్వే రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేయడం ప్రచార పిచ్చికి పరాకాష్ట కాదా?

సీయం క్యాంప్‌ ఆఫీస్‌లో సీయం సిగ్నేచర్‌కే రక్షణ లేదు, ప్రజల చేతికి ఒరిజినల్స్‌ ఇవ్వకుండా జిరాక్సులు ఇచ్చి ఆస్తుల పత్రాలు డిజిటలైజేషన్‌ చేస్తే ఏ విధంగా భద్రత ఉంటుంది? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను చిల్లర వ్యాపారంగా మార్చారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రుషికొండలాంటి ఎన్నో కొండలను, గుట్టలను మింగేసిన వైసీపీ నేతలు వారి దోపిడీని చట్టబద్దం చేసుకునేందుకు దొడ్డిదారిలో దొంగ చట్టాలను తీసుకొస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతల సిఫారసుల మేరకే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో భూములు రిజిస్ట్రేషన్‌ చేయడం వంటి కొత్త సాంప్రదాయాలకు కూడా తెరలేపారు.

రెవెన్యూ వ్యవహారాల్లో వైసీపీ నేతల జోక్యం ఏంటి? ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన రిజిస్ట్రేషన్‌ సేవలు కూడా ప్రైవేటు పరం చేయడం అసైన్డ్‌ భూముల చట్టాన్ని తీసుకురావడం వంటివన్నీ వైసీపీ నేతల ప్రయోజనాల కోసమే.  ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 27/2023ను, జీవో నెం.572ను రద్దు చేసే వరకు పోరాడతాం.

 

Leave a Reply